Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 387-1
సంపుటము: 4-504
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
కంటిమి నేఁడిదె గరుడాచలపతి
యింటివేలుపగు యీశ్వరుఁ డితఁడు
॥పల్లవి॥
శ్రీ నరసింహుఁడు చిన్మయ కాంతుఁడు
దానవాంతకుఁడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచే పోషకుఁ డితఁడు
॥కంటి॥
దేవాది దేవుఁడు దినకర తేజుఁడు
జీవాంత రంగుఁడు శ్రీ విభుఁడు
దైవ శిఖామణి తలఁచినవారిని
సేవలు గొని కాచే విభుఁడితఁడు
॥కంటి॥
పరమమూర్తి హరి ప్రహ్లాదవరదుఁడు
కరుణానిధి బుధ కల్పకము
పరగు శ్రీ వేంకటపతి తన దాసుల-
నరుదుగఁ గాచే యనంతుఁ డితఁడు
॥కంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము