అధ్యాత్మ సంకీర్తన
రేకు: 388-4
సంపుటము: 4-513
రేకు: 388-4
సంపుటము: 4-513
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| వినరయ్య నరసింహవిజయము జనులాల అనిశము సంపదలు నాయువు నొసఁగును | ॥పల్లవి॥ |
| మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె | ॥వినర॥ |
| అంతటఁ బ్రహ్లాదుఁడు ‘అన్నిటానున్నాఁ’డనియె పంతమున దానవుఁడు బాలునిఁ జూచి యెంతయుఁ గడఁకతోడ ‘ఇందులోఁ జూపు’మని చెంతనున్న కంబము చేతఁగొని వేసె | ॥వినర॥ |
| అటమీఁదట బ్రహ్మాండం బదరుచు కుటిల భయంకర ఘోషముతో చిట చిట చిటమని పెట పెట పెటమని పటపట మనుచును బగిలెఁ గంబము | ॥వినర॥ |
| కులగిరు లదరెను కుంభిని వడఁకెను తలఁకిరి దైత్యులు తల్లడిలి కలఁగెను జగములు కంపించె జగములు ప్రళయ కాలగతిఁ బాటిల్లె నపుడు | ॥వినర॥ |
| ఘననారసింహుఁ డదె కంబము నందు వెడలె కనుపట్టె నదిగొ చక్ర జ్వాలలు మునుకొని వెడలెఁ గార్ముకముక్త శరములు కనకకశివునకుఁ గలఁగె గుండియలు | ॥వినర॥ |
| అడరె నద్దేవుని కోపాగ్నులు బెడిదపు - మిడుఁగురుల తోడుత మిన్నులుముట్టి పిడుగులురాలేటి భీకర నఖరములు గడుసు రక్కసునికి గాలములై తగిలె | ॥వినర॥ |
| తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని కడుపు చించెను వాని గర్వమడఁగ వెడలెఁ జిల్లున వాని వేఁడి నెత్తురు నింగికి పొడి వొడియాయ శత్రు భూషణము లెల్లను | ॥వినర॥ |
| నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె తళుకుఁ గోరలు తళ తళమని మెరిచె | ॥వినర॥ |
| పెటలించి నరములు పెరికి కుప్పలువేసి గుటగుటమని రొప్పె గోవిందుఁడు చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి కుటిల దానవుఁ జూచి ‘ఖో’ యని యార్చెను | ॥వినర॥ |
| తెంచి శిరోజములు దిక్కులకు వాని - పంచ ప్రాణములు గొనెఁ బరమాత్ముఁడు అంచెల నీ రీతిని ప్రహ్లాదుని పగ నీఁగె మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి | ॥వినర॥ |
| అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు చిప్పిల వరములిచ్చీ శ్రీ వేంకటేశుఁడు | ॥వినర॥ |


