అధ్యాత్మ సంకీర్తన
రేకు: 389-6
సంపుటము: 4-519
రేకు: 389-6
సంపుటము: 4-519
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళిరామక్రియ
| ఇతఁడే పరబ్రహ్మ మిదియే రామకథ శతకోటివిస్తరము సర్వపుణ్యఫలము | ॥పల్లవి॥ |
| ధరలో రాముఁడు పుట్టె ధరణిజఁ బెండ్లాడె అరణ్య వాసుల కెల్లా నభయమిచ్చె సొరిది ముక్కుఁ జెవులు చుప్పనాతిని గోసె ఖర దూషణులను ఖండించి వేసె | ॥ఇతడే॥ |
| కినసి వాలిఁ జంపి కిష్కింధ సుగ్రీవు కిచ్చె వనధి బంధించి దాఁటె వానరులతో కనలి రావణ కుంభ కర్ణాదులను జంపి వనితఁ జేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును | ॥ఇతడే॥ |
| సౌమిత్రియు భరతుఁడు శత్రుఘ్నుఁడుఁ గొలువఁగ భూమి యేలె కుశలవ పుత్రలఁ గాంచె శ్రీ మంతుఁడై నిలిచె శ్రీ వేంకటాద్రిమీఁద కామించి విభీషణ లంకకుఁ బట్టము గట్టె | ॥ఇతడే॥ |


