అధ్యాత్మ సంకీర్తన
రేకు: 390-1
సంపుటము: 4-520
రేకు: 390-1
సంపుటము: 4-520
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను | ॥పల్లవి॥ |
| తటుకన మారీచు తలపైఁ బోయఁ గర్మము కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను | ॥రాము॥ |
| తరగె రావణు పూర్వతపములయాయుష్యము ఖర దూషణాదులకు కాలము దీరె గరిమ లంకకు నవగ్రహములు భేదించె సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను | ॥రాము॥ |
| పొరిఁ గుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చె మరలి గండము దాఁకె మండోదరికి పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను | ॥రాము॥ |


