Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 390-5
సంపుటము: 4-524
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు
యే దెసఁ జూచినాఁ దానె యీతఁడిది(?) దేవుఁడు
॥పల్లవి॥
నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ
జవ్వని తొడ మీఁదట సరస మాడ
పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని
వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు
॥ఆది॥
సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ
అంకెలఁ గటియభయహస్తా లెత్తి
కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు
॥ఆది॥
నానా దేవతల తోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు
తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు
॥ఆది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము