అధ్యాత్మ సంకీర్తన
రేకు: 35-1
సంపుటము: 1-214
రేకు: 35-1
సంపుటము: 1-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎండగాని నీడగాని యేమైనఁగాని కొండలరాయఁడే మా కులదైవము[1] | ॥ఎండ॥ |
| తేలుగాని పాముగాని [2]దేవపట్టయినఁగాని గాలిగాని ధూళిగాని కాని యేమైనా కాలకూటవిషమైన గక్కున మింగిన నాటి నీలవర్ణుఁడే మా నిజదైవము | ॥ఎండ॥ |
| చీమగాని దోమగాని చెలఁది యేమైనఁగాని గాముగాని నాముగాని కాని యేమైనా పాములనిన్నిటి మింగే బలుతేజిపైనున్న ధూమకేతువే మాకు దొర దైవము | ॥ఎండ॥ |
| పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైనఁగాని కల్లగాని పొల్లగాని కాని యేమైనా బల్లిదుఁడై వేంకటాద్రిపైనున్న యాతఁడే మ- మ్మెల్లకాలమును నేలేయింటి దైవము | ॥ఎండ॥ |
[1] నిడురేకు 115- గురుదైవము.
[2] దేవపట్టు = యక్షరాక్షసాదులుండేటి స్థలము కావచ్చు. “విధ్యాధరోఽప్సరో యక్షరక్షో గంధర్వకింనరాః| పిశాచో గుహ్యక స్సిద్ధోభూతోఽమీ దేవయోనయః||” అమరము. ‘దేవపట్టు’వంటి సమాసములు ఈవాఙ్మయమున కలంకారములు.


