అధ్యాత్మ సంకీర్తన
రేకు: 391-1
సంపుటము: 4-526
రేకు: 391-1
సంపుటము: 4-526
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| వీఁడివో కొలువున్నాఁడు విట్ఠలేశుఁడు మూఁడుమూర్తుల తేజపు మూల మీతఁడు | ॥పల్లవి॥ |
| పంతముతో పాండవపక్షపాతి యీతఁడు వింతలేని విదురునివిందు యీతఁడు మంతు కెక్కిన ద్రౌపదీ మాన రక్షకుఁడీతఁడు చెంతనే వుద్ధపు పాలి చింతామణి యీతఁడు | ॥వీడివో॥ |
| మంద గొల్లెత లకెల్లా మంగళసూత్ర మీతఁడు కందువ నక్రూరుని భాగ్యం బీతఁడు నంద గోప యశోదల నవ నిధాన మీతఁడు అందపు రుక్మిణీ మనోహరుఁ డీతఁడు | ॥వీడివో॥ |
| దేవకీ వసుదేవుల దివ్యపద వీతఁడు భావింప నందరి పర బ్రహ్మ మీతఁడు కైవశమై దాసులకు కల్ప వృక్ష మీతఁడు శ్రీ వేంకటాద్రి మీఁదిశ్రీ పతి యీతఁడు | ॥వీడివో॥ |


