Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 391-6
సంపుటము: 4-531
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
ఏలికె చెప్పినపని కెదురాడేనా
నీ లీల లివియని నిండుకుండే నేను
॥పల్లవి॥
నీవు నాలోనున్నాఁడవు నే నున్నాఁడ సముఖాన
కావరపుటింద్రియాలు కాకు సేసీని
దేవర నీయప్పణో తెలియనానతీ నాకు
ఆవిధమైతేనే అపరాధము లేదు
॥ఏలికె॥
జగదీశుడవు నీవు శరణాగతుఁడ నేను
జిగిఁ గామ క్రోధాలేల చిమ్మిరేఁచీని
నగుతా నప్పగించేవో నాకది గాదన రాదు
తగునిట్లానే యైతే తప్పులేదు మాకును
॥ఏలికె॥
పుట్టించేవాఁడవు నీవు పుట్టుగులు నాసొమ్ము
చుట్టి సుఖదుఃఖా లేల సూడువట్టీని
నెట్టన శ్రీవేంకటేశ నీనటనో మంచిదాయ
యిట్టయితే మావంక నిఁక నేరమి లేదు
॥ఏలికె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము