Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 19-1
సంపుటము: 4-538
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
కప్పురమునకుఁ గప్పురమై
చిప్పిలుఁ దావి మించె నితఁడు
॥పల్లవి॥
బంగారమునకు బంగారమై
శృంగార మమరె శ్రీ హరికి
అంగమయిన మొల పీతాంబరంబున
కొంగు బంగారై కూడె నితఁడు
॥కప్పుర॥
తట్టు పుణుఁగునకుఁ దట్టు పుణుఁగయి
ఘట్టిమేన మించెఁగా యితఁడు
నెట్టన నొసల నిండిన కస్తురి
బొట్టు చెమటతోఁ బొలెనికతఁడు
॥కప్పుర॥
పన్నీట పాదాన పన్నీరే తానయి
యిన్నిట శ్రీ వేంకటేశుఁడిదే
ఉన్నతి జలధి నుదయమున
కన్నియ కౌఁగిట ఘనుఁడితఁడు
॥కప్పుర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము