Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 20-1
సంపుటము: 4-539
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌
అరిది భవములందు నతఁడు వో యితఁడు
॥పల్లవి॥
కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
కొడుకు కొరకుఁగా గోరపడి
కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు
॥అరు॥
ఆలి తమ్ముని రాక కలరి మెచ్చెడిచోట
ఆలుఁ దానును నుండి యందులోన
ఆలిచంటికింద నడ్డమువడుకున్న
ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు
॥అరు॥
సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
సవతులేనిపంటఁ జప్పరించివేసి
అవల యివల సేసి నతఁడు వో యితఁడు
॥అరు॥
తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ
దొలఁగి తోలాడెడి దొడ్డవాని
తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
యడియాలమగు మేని యతఁడు వో యితఁడు
॥అరు॥
పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
పదము వదము మౌవఁ బరగఁ జేసి
పదముననె దివ్యపదమిచ్చి మనుమని
నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు
॥అరు॥
అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
యత్తయింటిలోన నధికుఁ జేసి
మత్తిల్లు తనతోడ మలసిన యాతని
నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు
॥అరు॥
పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
పాముకుఁ బ్రాణమై పరగువాని
ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన
ఆమాటనిజముల అతఁడు వో యితఁడు
॥అరు॥
ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
యెత్తుకలుగు మద మిగుర మోఁది
మత్తిల్లు చదువుల మౌనిఁ జం... ...
అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు
॥అరు॥
బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
పగలుగాఁగ రేయివగలు సేసి
జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల
అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు
॥అరు॥
మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
పెట్టెడిరాయ....................................
కట్టెడికాలము కడపట నదయుల(?)
నట్టలాడించిన అతఁడు వో యితఁడు
॥అరు॥
తలఁకకిన్నియుఁ జేసి తనుఁగాని యాతని
వలెనె నేఁడు వచ్చి వసుధలోన
వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు
॥అరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము