Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 28-2
సంపుటము: 4-545
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏమనవచ్చును గొందరికింపౌఁ బులుసులుఁ దీపులు
సోమరితనమున నిన్నిటఁ జొరదీ నా తలఁపు
॥పల్లవి॥
పదిలంబుగ సర్వాత్మక భావము దలఁచినపిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచిన మొక్కక పోరాదు
వదలక యిన్నిటను శ్రీవల్లభుఁడున్నాఁడుండిన
హృదయము చంచలమిన్నిట నెనయదు నామనసు
॥ఏమన॥
ఎక్కడఁ జూచినఁ బ్రాణులకిన్నియు నాచారములే
చిక్కక యిన్నియుఁగైకొని చేయక పోరాదు
మక్కువ నిన్నియు శ్రీ హరి మతములె కానీ అయినా
ఒక్కటియే చాలును నాకొడఁబడవితరములు
॥ఏమన॥
ఏరీతులనటు చూచిన నిందరు బలుదైవములే
కూరిమినందరినటువలెఁ గొలువకపోరాదు
ధారుణి వేంకటపతిచేఁతలు ఇవియైనాఁగాని
కోరిక నా కితఁడే మరి కొరకొరలిన్నియును
॥ఏమన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము