Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 37-1
సంపుటము: 4-556
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ధనముగని మరికదా ధనికుఁడౌట - మొదల
తనుఁ దానెఱుఁగలేని తలఁపేఁటి తలఁపు
॥పల్లవి॥
మచ్చికల నినుఁగొలిచి మరికదా సుఖులౌట
యెచ్చోట నేవేల్పులెవ్వరైన
అచ్చుపడ నటువంటి హరి నిన్నుఁ గొలిచి నీ
మెచ్చువడయఁగలేని మేలేఁటి మేలు
॥ధనము॥
కందువగ నినుఁ గొలువఁగనికదా ఘనులౌట
యెందునరుదగు వేల్పులెందరైన
అందముగ పరదైవమని నిన్నుఁ గనలేక
గొందిఁబడి పొరలేటి కూడేఁటి కూడు
॥ధనము॥
వేరక నినుఁగొలిచి వేంకటనగేశ నీ
దాసులై మరికదా ధన్యులౌట
వాసి వట్టముకొరకు వదలి దినములచేతఁ
బాసి పోయినవెనక పరమేడ పరము
॥ధనము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము