అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 48-1
సంపుటము: 4-560
నిడు రేకు: 48-1
సంపుటము: 4-560
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంత కాని లేదు తాము సేసినంత వట్టు తమకుఁ బోరాదు | ॥పల్లవి॥ |
| ఇట్టు నట్టు మిట్టిపడ్డ నించుకంతా లేదు - వీఁపు పట్టగట్ట మోఁపు మోఁచి పాటువడ్డ లేదు తట్టువడ లోకమెల్ల దవ్వుకొన్న లేదు తెట్ట తెరువున నోరుదెరచిన లేదు | ॥ఏమి॥ |
| అడిగిపరుల బతుకాసపడ్డ లేదు - భీతి విడిచి నెత్తుటఁ దోఁగి వీరుఁడైన లేదు అడవులెల్లఁ దిరిగి అలమటించిన లేదు ఇడుమపాటుఁజొచ్చి యియ్యకొన్న లేదు | ॥ఏమి॥ |
| వచ్చి వచ్చి వనితల వలపించుకొన్న లేదు మెచ్చుల గుఱ్ఱమునెక్కి మేటియైన లేదు ఎచ్చరకఁ దిరువేంకటేశుఁ గొలువకుంటే ఇచ్చటచ్చట సుఖమించుకంత లేదు | ॥ఏమి॥ |


