Display:
అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 54-1
సంపుటము: 4-567
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
బొడ్డు తామెరలోన గడ్డివయసు పెద్ద-
బిడ్డఁ గన్నట్టివాడుఁ పిన్నవాడు
॥పల్లవి॥
బిరుసైన దొకకొండ పెనుబాముతోఁ జుట్టి
బిరబిరనె త్రిప్పే పిన్నవాఁడు
గురుతైనదొకకొండ గొడగుగా నొకచేత
పెరికి పట్టేవాఁడు పిన్నవాఁడు
॥బొడ్డు॥
బెడిదంపు శిశుపాలు పెనుమోఁతతోగూడ
పెడచేతనే వేసెఁ బిన్నవాఁడు
పడవేసి చాణూరుఁ బట్టి యురము దొక్కి
పిడికిటనే చంపే పిన్నవాఁడు
॥బొడ్డు॥
ఎక్కడఁ జూచినఁ నింతటఁ దానై
పెక్కురూపములైన పిన్నవాఁడు
ఇక్కడఁ దిరువేంకటేశుఁడై జగమెల్ల
పిక్కిటిల్లినవాడు పిన్నవాఁడు
॥బొడ్డు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము