అధ్యాత్మ సంకీర్తన
నిడు రేకు: 75-1
సంపుటము: 4-578
నిడు రేకు: 75-1
సంపుటము: 4-578
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ?---
| ఈతఁడే హరుఁడు యీతఁడే యజుఁడు ఈతనికి నీచేఁతలెంత ఘనమటు గాన | ॥పల్లవి॥ |
| కడుఁ బెక్కు బ్రహ్మాండకటకములు సుడివడిన కడుపలో నిడుకొన్న ఘనుఁడు వెడలి పూతకిచంటివిషము దాఁగినయంత వడిఁ దనకు నేమాయ వట్టిబూమెలు గాక | ॥ఈత॥ |
| ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు డుల్లసిల్లుచు నీతఁడుండు మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి బల్లిదుఁడవని నిన్నుఁ బరిణమింతురుగాన | ॥ఈత॥ |
| తిరువేంకటేశ్వరుఁడు దేవదేవోత్తముఁడు పరిపూర్ణుఁ డచ్యుతుఁ డభవుఁడు శరణాగతుల రక్షసేయు వాడను మాఁటి గురుతుగాఁ దలపోసి కొనియాడఁగా వలసె | ॥ఈత॥ |


