Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-2
సంపుటము: 1-22
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఇందిర వడ్డించ నింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామీ
॥ఇందిర॥
అక్కాళపాశాలు నప్పాలు వడలు
పెక్కైన సయిఁదంపు పేణులును
సక్కెరరాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామీ
॥ఇందిర॥
మీరిన కెళంగు మిరియపుఁ దాళింపుఁ-
గూరలు కమ్మని కూరలును
సారంపుఁ బచ్చళ్ళు చవులుగ నిట్టే
కూరిమితోఁ జేకొనవో స్వామీ
॥ఇందిర॥
పిండివంటలునుఁ బెరుగులుఁ బాలు
మెండైన [1]పాశాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ
॥ఇందిర॥

[1] ఇది ‘పాయస’ శబ్దమునకు వ్యావహారికరూపము కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము