శృంగార సంకీర్తన
రేకు: 2-1
సంపుటము: 5-6
రేకు: 2-1
సంపుటము: 5-6
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| తగిలిన మునులే యాతని గందురంటా మగువ యెవ్వరితోడ మాటాడదిపుడు | ॥పల్లవి॥ |
| అతులనిరాహారులతనికిఁ బ్రియులంటా అతివ నిన్నటినుండి యారగించదు తతి నడవులనుండే తపసులే యతనికి హితులంటా వనములో నెడయదీతరుణి | ॥తగిలి॥ |
| తలకొన్న యతనిపై తలఁపే పరమంటా చెలియ చెక్కిటనున్న చెయి దియ్యదు వలనైన యతఁడు దేవతల కొడయఁడంటా కలికి రేయిఁబగలు కనుముయ్యదిపుడు | ॥తగిలి॥ |
| అడరి జలములోన నతఁడుండునంటా వడియుఁ జెమట దుడువదు మేనను కడు మంచియతఁడు వేంకటగిరిభుఁడంటా పడఁతి యాతనినె గుబ్బలనొత్తీ నిపుడు | ॥తగిలి॥ |


