Display:
శృంగార సంకీర్తన
రేకు: 3-6
సంపుటము: 5-17
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవంబిఁక నొకటి కలదా
॥పల్లవి॥
అతివ జన్మము సఫలమై పరమయోగివలె-
నితర మోహపేక్షలిన్నియును విడిచె
సతికోరికలు మహశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసనవోలె నుండె
॥ఇది॥
తరుణి హృదయము కృతార్థతఁ బొంది విభుమీఁది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనోజయమంది యింతలో
సరిలేక మనసు నిశ్చల భావమాయ
॥ఇది॥
శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్వ-
భావంబు నిజముగా బట్టెఁ జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము