Display:
శృంగార సంకీర్తన
రేకు: 4-1
సంపుటము: 5-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతం
శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
॥పల్లవి॥
అరుదుగ మును నరకాసురుఁడు
సిరులతోఁ జెరలుదెచ్చిన సతుల
పరువపు వయసుల బదారువేలను
సొరిదిఁ బెండ్లాడిన సుముఖునికి
॥శోభ॥
చెందిన వేడుక శిశుపాలుఁడు
అంది పెండ్లాడఁగ నవగ ళించి
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి
సందడిఁ బెండ్లాడిన సరసునికి
॥శోభ॥
దేవదానవులు ధీరతను
దావతిపడి వార్ధి దరువఁగను
శ్రీ వనితామణిఁ జెలగి పెండ్లాడిన
శ్రీ వేంకటగిరి శ్రీ నిధికి
॥శోభ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము