Display:
శృంగార సంకీర్తన
రేకు: 8-4
సంపుటము: 5-47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎట్టయినఁ జేయరా నీ విఁకనేలా నన్నుఁ
బట్టకుర పలుమారు పదివేలు వచ్చెను
॥పల్లవి॥
ఇంత సేసితివి చాలు నిఁకనేలా తొల్లే
యింతటివాఁడని నిన్నెఱగనా
ఇంతులపై దయగలదిఁక నేలా నీ-
పంతములే నీకుఁజెల్లె పదివేలు వచ్చెను
॥ఎట్టయి॥
ఇచ్చలాడకురా నాతో నికఁనేలా నీ-
యచ్చటమ్ములే నిజమాయఁగా
యెచ్చరిక మఱచితినిఁకనేలా నన్ను
పచ్చిసేయకురా యింత పదివేలు వచ్చెను
॥ఎట్టయి॥
ఇనుమడించె నీచేఁత లిఁకనేలా నీ-
కనుమాయలిన్నియుఁ గంటిమిగా
యెనసి వేంకటపతి యిఁకనేలా నన్నుఁ
బనుపరచితివిట్టే పదివేలు వచ్చెను
॥ఎట్టయి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము