Display:
శృంగార సంకీర్తన
రేకు: 9-2
సంపుటము: 5-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
కాలమెల్లా మోసపోవు (ము?) కానియ్యరా కల-
కాలమెల్లా జరపేవు కానియ్యరా
॥పల్లవి॥
ఎడపుల జవ్వనపుటింతి నొకతెఁ గూడి
కడలనే తిరిగేవు కానియ్యరా
మెడగట్టుకొకతెకు మేలుఁవాడవై నీవు
కడవ బొంకేవు నాతో కానియ్యరా
॥కాల॥
బంగారు మెఱుఁగుచాయ పడఁతినొకతె గూడి
కంగనాడేవు నాతో కానియ్యరా
అంగన నొకతె వెనకమర దాచుకొని చొఁ
క్కంగఁ జేసి ముద్దాడేవు కానియ్యరా
॥కాల॥
సంపద గలాసెఁ గూడి సరములాడుచు
కంపులే పూసేవు కానియ్యలా
వెంపరలాడుచు నీ వెంటనొకతె రాఁగా
కంపించకు వేంకటేశ కానియ్యరా
॥కాల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము