శృంగార సంకీర్తన
రేకు: 9-5
సంపుటము: 5-54
రేకు: 9-5
సంపుటము: 5-54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| మదము దొలఁకెడియట్టి మంచివయసున మనకు తుదలేని వేడుకలు దొరకుటెన్నఁడురా | ॥పల్లవి॥ |
| ఉదుటుఁ జనుదోయి నీవురముపై దనివార- నదిమి మోమును మోము నలమి యలమి వదలైన నీవితో నాలుఁగన్నుల జంకెఁ లొదవ నీ మీఁద నే నొరగుటెన్నఁడురా | ॥మదము॥ |
| కలికితనమునఁ నాదు కప్పురపుఁ దమ్ములము కులికి నీ వదనమునఁ గుమ్మరించి పలచనగు గోళ్ళ నీ పగడవాతెర నొక్కి చెలువమగు నునుగంటి సేయుటెన్నఁడురా | ॥మదము॥ |
| గరగరని కురులతో కస్తూరివాసనలు విరితావులతోడ విసరఁగాను తిరువేంకటాచలాధిపుఁడ నిను గూడి నే- నరమరచి సదమదములౌట యెన్నఁడురా | ॥మదము॥ |


