Display:
శృంగార సంకీర్తన
రేకు: 10-5
సంపుటము: 5-60
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిజ్జిజి
తరుణిపై మరునికి దయలేదు నీవు
మరునినే పోలితి మరి యేఁటిబ్రదుకు
॥పల్లవి॥
ఎదురు చూచి చూచి యింతక యేమౌనో
హృదయము ఝల్లనీ నిటుదలఁచి
పొదల తీగెలయింటఁ బొరలి యేమౌనో
మదిరాక్షికొకటైన మరియేఁటిబ్రదుకు
॥తరుణి॥
చెలుల దూరిదూరి సిగ్గుననేమౌనో
తలఁచి తలఁచి గుండె తల్లడించీని
కల నిన్నుఁగని లేచి గక్కన నేమౌనో
మలసి వెన్నెలమంట మరియేఁటిబ్రదుకు
॥తరుణి॥
ఇంతి గలయకున్న నిఁక నెంత యౌనో
పంతపు వేంకటరాయ భయమయ్యీని
ఇంత నీకరుణ నిఁక నెంత యౌనో
మంతనమింత లేకున్న మరియేఁటి బ్రదుకు
॥తరుణి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము