Display:
శృంగార సంకీర్తన
రేకు: 10-6
సంపుటము: 5-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
వద్దే గొల్లెత వదలకువే - నీ-
ముద్దు (ముద్దు) మాటలకు మొక్కేమయ్యా
॥పల్లవి॥
యేలే యేలే యేలే గొల్లెత
నాలాగెఱఁగవా నన్ను నేఁచేవు
చాలుఁజాలు నిఁకఁజాలు నీరచనలు
పోలవు బొంకులు పోవయ్యా
॥వద్దే॥
కానీ కానీ కానిలే గొల్లెత
పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారుఁ జెనుకుచు మా-
తోనిటు సొలయక తొలవయ్యా
॥వద్దే॥
రావా రావా రావా గొల్లెత
శ్రీవేంకటగిరి చెలువుఁడను
నీవె నీవె నను నించితి కౌఁగిట
కైవశమైతినిఁ గదవయ్యా
॥వద్దే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము