Display:
శృంగార సంకీర్తన
రేకు: 11-1
సంపుటము: 5-62
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
మెచ్చితి బళిరా వోరి మేటిజాణ నన్నుఁ
బచ్చి చేసేదింత నీకుఁ బంతమా లోకానను
॥పల్లవి॥
ఏకతాన సొలసి నేనేమి నీతోఁ బలికినా
ఆకెతోనే విన్నవించేవాపఁగ లేక
పైకొని వలచి కిందుపడిన యింతులమాఁట
కాకు సేసే మగవాఁడు గలఁడా లోకానను
॥మెచ్చి॥
చక్కఁగా నేఁదీసిన సన్నపు నీపై రేక
యెక్కువ నాకెకే చుపేవేతులకును
మక్కువ నిలుపలేని మగువల వెలిపుచ్చి
వెక్కమయినవాఁడు విభుఁడా లోకానను
॥మెచ్చి॥
ఉండలేక చేతనున్న వుంగరమిచ్చినఁ బోయి
వెండియు నాకెకేయిచ్చి విఱ్ఱవీఁగేవు
కండగట్టుకొంటివా వేంకటరమణుఁడ దీన
బండుసేసితివి నన్ను బాపురా లోకానను
॥మెచ్చి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము