Display:
శృంగార సంకీర్తన
రేకు: 11-2
సంపుటము: 5-63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి, ఏకతాళి
సన్నపు నవ్వుఁజూపుల చల్లులాఁడి యిప్పు-
డిన్నివిధముల మించె నిదివో తపము
॥పల్లవి॥
ఏడునిలువుల పైఁడిమేడమీఁద నుండి నిన్నుఁ
జూడ వేడుకైన మించుఁజూపు లాడి
వాడుచు నీకునెదురు వడిఁజూడ నంతలో నీ-
వేడనుండో విచ్చేసితివిదివో తపము
॥సన్న॥
కొత్తలయిన మాణికపు కొలువుటోవరిలోన
ముత్తేల చెఱఁగుదూలు మురువులాఁడి
తత్తరానఁ దమకించి తరుణికోరికలెల్ల-
నిత్తునని విచ్చేసితివిదివో తపము
॥సన్న॥
పుప్పొడితావులు చల్లు పువ్వులచప్పరములో
కొప్పు నన్నుఁ బెట్టుమన్న గుబ్బలాఁడి
తెప్పలుగ నినుఁగూడి తిరువేంకటేశ నిన్ను-
నెప్పుడుఁ బాయకున్నదిదివో తపము
॥సన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము