శృంగార సంకీర్తన
రేకు: 12-1
సంపుటము: 5-68
రేకు: 12-1
సంపుటము: 5-68
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| చక్కఁదనముల చేత జవ్వనభారము చేత యెక్కడౌటాఁ గానదిఁక నేమి సేతమే | ॥పల్లవి॥ |
| ఒయ్యనె బంగారు తూఁగుటుయ్యాల మంచముమీఁద పయ్యెద చెఱఁగు జారఁ బవ్వళించి ముయ్యక మూసిన రెప్ప మూయుచుఁ దెరచుఁ గాని నెయ్యమునఁ జూడనేరదేమి సేతమే | ॥చక్క॥ |
| ముత్తేల గద్దియమీఁద ముద్దుల కురులు దూల- నొత్తిలి యొకతె మీఁద నొరగుండి చిత్తగించి చేతనున్న చెంగలున బంతిఁ జెక్కు- లొత్తుఁగాని మాటలొల్లదేమి సేతమే | ॥చక్క॥ |
| కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ చిమ్ముఁ జెమటలతోడఁ జెలువొంది కొమ్మకు నేడుఁగలిగె కోనేటిరాయని పొందు నెమ్మనము దాఁచ నేరదేమి సేతమే | ॥చక్క॥ |


