శృంగార సంకీర్తన
రేకు: 14-2
సంపుటము: 5-80
రేకు: 14-2
సంపుటము: 5-80
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| చెలియకు విరహపు వేదన సేయని సింగారంబిది సొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ | ॥పల్లవి॥ |
| కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన బగిలెడి నయ్యో పక్కనఁ గనుకలి దాఁకీ బయ్యెద దెరవకుఁడీ వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ | ॥చెలియ॥ |
| అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో బంగరు మొలకలవంటివి పైపైఁ దుడువకుఁడీ తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల ముంగిటవేసిన చూపుల మురిపెము మానుపుఁడీ | ॥చెలియ॥ |
| తిరువేంకటపతినింతికి దెచ్చెదమనఁగా నయ్యో కరుణించినవాఁడాతఁడె కళవళమందకుఁడీ తరుణీమణి మా దేవునిఁ దగఁ గౌఁగిట సౌఖ్యంబులు పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ | ॥చెలియ॥ |


