శృంగార సంకీర్తన
రేకు: 17-3
సంపుటము: 5-98
రేకు: 17-3
సంపుటము: 5-98
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు- కులము స్వామికిని గొబ్బిళ్ళో | ॥పల్లవి॥ |
| కొండ గొడుగుగా గోవులఁ గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెల్లను తల- గుండు గండనికి గొబ్బిళ్ళో | ॥కొలని॥ |
| పాపవిధుల శిశుపాలుని తిట్ల- కోపగానికిని గొబ్బిళ్ళో యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన- గోపబాలునికి గొబ్బిళ్ళో | ॥కొలని॥ |
| దండి వైరులను తఱమిని దనుజుల- గుండె దిగులునకు గొబ్బిళ్ళో వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో | ॥కొలని॥ |


