శృంగార సంకీర్తన
రేకు: 20-3
సంపుటము: 5-110
రేకు: 20-3
సంపుటము: 5-110
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| అంతరంతకు గాలినణఁగునా యనలంబు కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁ గాక | ॥పల్లవి॥ |
| కలువలూరక నీటఁ గందునా యెందైనఁ జెలియకన్నీరిట్లఁ జేసెఁ గాక జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల నలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక | ॥అంత॥ |
| విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన మరుబాణముల నెరులు మలఁగెఁగాక సరుస మంచునఁ దీగె వాడునా యెందైన అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక | ॥అంత॥ |
| కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల కొమరె గుబ్బలమీఁదఁ గూడెఁ గాక తిమిరంబు తిమిరమునఁ దెమలునా యెందైన రమణి వేంకటవిభుని రతిమఱపుగాక | ॥అంత॥ |


