Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 38-4
సంపుటము: 1-234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి, అటతాళం
కూడులేక యాఁకటికిఁ గూరఁ దిన్నట్లు
ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య
॥కూడు॥
దుండగపుఁ బగవారు దోఁచఁగానే తమకాన
కొండలెక్కినట్లు సిగ్గు గొల్లఁ బోఁగాను
దండువెళ్లే మదనుని దాడికి సతుల చన్ను-
గొండలెక్కి సారెసారె [1]గోడనేరయ్య
॥కూడు॥
పొదిగొన్న యలపుతోఁ [2]బొదలు తీగెలక్రింద
తుదలేని భయముతోఁ దూరినట్లు
మృదువైన తరుణుల మెఱఁగు బాహులతల
పొదలెల్లఁ దూరితూరి పుంగుడయ్యేరయ్య
॥కూడు॥
వలసగంపల మోపువలె లంపటము మోఁచి
తలఁకుచుఁ బారలేక దాఁగినయట్లు
యిల వేంకటేశ నిన్నెఱఁగ కింద్రియముల
తలవరు లిండ్లనే దాఁగేరయ్య
॥కూడు॥

[1] గోడు + అనేరు.

[2] ‘బొదల’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము