Display:
శృంగార సంకీర్తన
రేకు: 22-3
సంపుటము: 5-122
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
కటకట సతిశృంగారము కన్నులపండువు దోఁపుచు
యిటువలె నిలిచి చిత్తంబిందరి నేఁపెడిని
॥పల్లవి॥
కోమలి కొప్పునఁ జెరివిన క్రొవ్విరులాత్మజు శరములు
వేమరుఁ బొదిగొన నాఁటిన విధమున నొప్పెడిని
కామిని పూసిన కస్తూరి కంతుని బాణారుణిమే
యీమైఁ బైపైఁ బేరిన యిటువలె నొప్పెడిని
॥కట॥
అతివకు భూషణజాలంబంతయు మరువస్త్రములకు
జతనంబగు మైమరువై సరిఁ జెలువొందెడిని
సతి గట్టన వెలిపుట్టము చంపెడు మదనుని బారికి
సితకరుఁడడ్డము చొచ్చిన చెలువము దోఁపెడిని
॥కట॥
బలుపగు చెలిచనుగుబ్బలపై వేంకటపతి నించిన-
లలితపు రేఖల బిత్తరిలాగులు దోఁపుచును
వలరాయని చిరునమ్ములు వడిఁదాకిన గంట్లవలెఁ
బొలుపుగఁ జూచినవారల బొమ్మరపరపెడిని
॥కట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము