Display:
శృంగార సంకీర్తన
రేకు: 25-3
సంపుటము: 5-140
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
చిత్తము నిజమైనఁ జేరు నేపనులైన
బత్తి సౌఖ్యమునకుఁ బ్రాణము
॥పల్లవి॥
కన్నుల కలికికిఁ గలిగెఁబో కడ-
కన్నులమీఁది బింకపు నవ్వు
చిన్నిచెక్కులమీఁది చెమటలు -మేన-
నన్నువ మురిపెపుటలపులు
॥చిత్త॥
తోయజగంధికి దొరకెఁబో మన -
మాయ నియతితోడి మఱపులు
సోయగమగు మోము సొబగులు- కడు-
రాయిడి చనుదోయి రచనలు
॥చిత్త॥
లావణ్యమతి మీఁద లాసెఁబో
శ్రీ వేంకటేశుని చెలుములు
తావి చల్లెడి కమ్మఁదనములు - పాసి-
పోవని విభుతోడి పొందులు
॥చిత్త॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము