Display:
శృంగార సంకీర్తన
రేకు: 25-4
సంపుటము: 5-141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఒయ్యనె దగ్గరరమ్మ వూడిగాల సతులు
అయ్యో విసరరమ్మ అలశున్నవాఁడు
॥పల్లవి॥
కరఁగు-జెమటలతో గందపుఁ బేంట్లతోడ
ఒరగి పవ్వళించున్నాఁడొ త్తగిల్లి
సరసపు మాటలతో చాఁచిన పాదములతో
గురియైన సతులతో గోవిందరాజు
॥ఒయ్య॥
తెల్లని కన్నులతోడ తేనెగారు మోవితోడ
చెల్లుబడిఁ బవ్వళించీ శేషునిమీఁద
వెల్లిగొను పూర్పులతో వెన్నెల నవ్వులతోడ
కొల్లవలపులతోడ గోవిందరాజు
॥ఒయ్య॥
బొడ్డు పూఁపకొడుకుతో పుక్కిటి తమ్ములముతో -
నొడ్డిన రతులతోడ నోలలాడీని
వెడ్డు వెట్టి కూడెనిదె వేంకటేశుఁడింతులను
గొడ్డువోని వరముల గోవిందరాజు
॥ఒయ్య॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము