శృంగార సంకీర్తన
రేకు: 25-6
సంపుటము: 5-143
రేకు: 25-6
సంపుటము: 5-143
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధరామక్రియ
| ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి కన్నె నీరాశికూటమి గలిగిన రాశి | ॥పల్లవి॥ |
| కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి చెలఁగు హరిమధ్యకును సింహరాశి | ॥ఇన్ని॥ |
| చిన్నిమకరాంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నెపాయపు సతికి కన్నెరాశి వన్నెమై పైఁడితులఁదూఁగు వనితకుఁ దులారాశి తిన్ననివాఁడి గోళ్ళసతికి వృశ్చికరాశి | ॥ఇన్ని॥ |
| ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాఁటల సతి కర్కాటకరాశి కోమలపు చిగురువమోవి కోమలికి మేషరాశి ప్రేమ వేంకటపతిఁ గలసె ప్రియమిథునరాశి | ॥ఇన్ని॥ |


