శృంగార సంకీర్తన
రేకు: 26-4
సంపుటము: 5-147
రేకు: 26-4
సంపుటము: 5-147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అయ్యో వీఁడు నన్నణఁకించీనే వీని- కొయ్యతనా లణఁచక కోపమేల తీరునే | ॥పల్లవి॥ |
| గుట్టున వాఁడిందు రాఁగ గొబ్బన నే ముంగురులు పట్టుకొని పరపుపైఁ బడఁదీసి గట్టిగ గుబ్బలమీఁది కస్తూరిచెమటలనే అట్టునిట్టు సేయక నాయల పేల తీరునే | ॥అయ్యో॥ |
| గక్కున వాఁడిందు రాఁగా గడెవెట్టి తమకాన చెక్కుదోయి నాకొనచేతనే నొక్కి పుక్కిటితమ్ములమిడిపొదిగొన్న కౌఁగిటిలో నొక్కినఁగాని నానొగులేల తీరునే | ॥అయ్యో॥ |
| కూరిమి వాఁడిందు రాఁగా కొంకక నా వాఁడిగోళ్ళ జీరలుగా నొడలెల్ల జిమ్ముచుఁ దీసి ధీరత వేంకటగిరి దేవుఁడైన వానికి నా- నేరుపెల్లఁ జూపక నా నెగులేల తీరునే | ॥అయ్యో॥ |


