Display:
శృంగార సంకీర్తన
రేకు: 27-3
సంపుటము: 5-152
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రగుజ్జరి
కన్నులనే నవ్వితే నే గబ్బిదాననా నీవు
నన్నునేల యిట్లా సన్నలనే తిట్టేవు
॥పల్లవి॥
గొల్లచల్లంటానే యక్కునఁ బోయుమనేవు
చెల్లఁబో గొల్లవారింత చెడఁబోయిరా
గొల్లువేసి యలకల కొప్పున నే ముడిచిన
మల్లెపూవులేల నీకు మనసాయ నిపుడు
॥కన్ను॥
కొంత కోక నల్ల నైతే గొరుపడము సవేవు
అంత నేను సదరమనైతినా నీకు
పంతగాఁడవట్టియాకంబళి నీవు ధరియించి
అంత నింతనుండి యాల ఆవులఁగాచితివి
॥కన్ను॥
మాఁటలాడ నేరకుంటే మాయదారిననేవు
వేఁటలోన ననునింత వేఁచుమంటినా
యేఁటికింత తిరువేంకటేశ నన్నుఁ గరఁగించి
పూఁట పూఁటకింతేసి బూమెలు సేసేవు
॥కన్ను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము