Display:
శృంగార సంకీర్తన
రేకు: 29-3
సంపుటము: 5-164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కామిని నీ సౌభాగ్యము గలిగిన ఫలమిది గలిగెను
ఆమని వెన్నెలకేఁటికి నలయుచు వచ్చెదవే
॥పల్లవి॥
గుబ్బల చెమటల పయ్యెద కొనగొంగున నల్లార్పుచు
ఉబ్బున గమనావస్థల నూఁటాడెదవేలే
బబ్బిలికాయల రవములు పదనూపురములఁ గెలయఁగ
తబ్బిబ్బుగ నునుపాదము తాటించెదవేలే
॥కామి॥
ఎత్తిన కరమూలపురుచులిరుగడ మెఱుఁగులు దొలఁకఁగ
తత్తరమందుచు నెవ్వనిఁ దలఁపుచు మ్రొక్కెదపు
ముత్తెపుసరముల వేఁగున మరియుచు నెచ్చరివై నీ-
వొత్తిలి నిట్టూర్పులతో నొయ్యన పలికెదవే
॥కామి॥
తావులు చల్లెటి దేహము తలఁపులుమీరిన హరుషము
లోవెలుతుల వెడయాసలు లోపలి కోరికలు
శ్రీవేంకటగిరినాథుని చెలువపు కౌఁగిటి వుయ్యల
భావజసౌఖ్యాంబుధిలో పలుమరుఁ జెలఁగెదవే
॥కామి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము