Display:
శృంగార సంకీర్తన
రేకు: 30-6
సంపుటము: 5-172
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును
॥పల్లవి॥
చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పురంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును
॥ఉయ్యాల॥
పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపై బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు
॥ఉయ్యాల॥
వెన్నెలల వేంకటాద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసీని జెలియ
॥ఉయ్యాల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము