శృంగార సంకీర్తన
రేకు: 61-3
సంపుటము: 5-177
రేకు: 61-3
సంపుటము: 5-177
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎటువంటి భోగి వీఁడెటువంటి జాణ వటపత్రమున నున్నవాఁడా వీఁడు | ॥పల్లవి॥ |
| పొదిగొనఁ బూచిన పున్నాగతరులలో పొదలుఁ బుప్పొళ్ళపైఁ బూఁదేనె సోనలు గదలుచు జడివానకాలంపుఁ బెదపెద్ద- నదులై పారనున్నతిని కదలని నడిగడ్డ కల్పభూజంబుల పదిలమైన నీడ బంగారు చవికెలో కదిసిన జలరాశి కన్నెకౌఁగిటఁ గూడి వదలకెప్పుడు నున్నవాఁడా వీఁడు | ॥ఎటు॥ |
| వలనగు తావుల వాంతికలలోన కెలఁకుల నరవెడ్పుఁ గెందామరలయందు పొలయుచు గొజ్జంగపూవుల దూళితో లలితంపు గాలి చల్లఁగను కొలందిమీరిన మంచి కోనేటి పన్నీటి- జలములలో నున్న జలముఖులుఁ దాను అలరుచుఁ దననోలలాడుచు నేప్రొద్దు వలపులు చల్లినవాఁడా వీఁడు | ॥ఎటు॥ |
| లోకము లోపలి లోలలోచనలెల్లా జోకైన తనవాలుఁ జూపులచేఁ జిక్కి యీకడాకడ చూడనెఱఁగక నిజమైన- సాకారమునకె మెచ్చఁగను పైకొన్న సరసపుఁ బలుకులఁ గరఁగించి యేంకాతమున సౌఖ్యమెల్లఁ జేకొనుచుఁ దా- నీకడఁ దిరువేంకటేశుఁ డై యున్నాఁడు వైకుంఠపతియైన వాఁడా వీఁడు | ॥ఎటు॥ |


