Display:
శృంగార సంకీర్తన
రేకు: 64-2
సంపుటము: 5-194
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
చెలఁగి కూరాకుగాఁ జేసేవు నీ-
తలమీఁదనుండే తరుణిఁ బో నేను
॥పల్లవి॥
పిసుకకు పలుమారు పసురువేసీ నంత
వసివాడుకోర్చిన వనితఁ గాను
పస రేఁచి నీవింత పాలించు తొల్లిటిఁ
సిసువయిన నీ పెట్టుఁ జెట్టఁబో నేను
॥చెలఁగి॥
చిదుమకు పరుమారు చెక్కునొచ్చీ నీవు
వదనము నొక్కేటి వనితఁ గాను
ఎదురెదురనే భూమినెందరు లేరు నీఁ
నిదురవుచ్చినవారు నేనెవ్వతిని
॥చెలఁగి॥
కందించకు నన్నుఁ గౌఁగిట కాఁకల
అందునిందును గడు నలముచును
ఇందిరాపతి వేంకటేశ నీరతుల
పొందు నాకిదె మఱపుకెల్ల నెలవు
॥చెలఁగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము