అధ్యాత్మ సంకీర్తన
రేకు: 39-6
సంపుటము: 1-242
రేకు: 39-6
సంపుటము: 1-242
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి, జంపెతాళం
| సొగియునా మఱియు ముచ్చుకుఁ బండువెన్నెలలు పగవానివలెనె లోపల దాఁగుఁ గాక | ॥సొగియు॥ |
| దక్కునా పేదకును తరముగాని ధనంబు చిక్కి యెవ్వరికై నఁ జేరుఁ గాక వెక్కసంబైన గోవిందునిఁ దలఁపు బుద్ధి తక్కిన పరులకెల్లఁ దలఁపేల కలుగు | ॥సొగియు॥ |
| అరగునా దుర్బలున కరుదైన యన్నంబు [1]కురుచబుద్ధులను నరమిగొనుఁ గాక తొరలునా హరివినుతి దుష్టునకు నది నోరఁ దొరలెనా యతనినే దూషించుఁ గాక | ॥సొగియు॥ |
| చెల్లునా యమృతంబు సేవించ నధమునకు వొల్లనని నేలపై నొలుకుఁ గాక వెల్లిగొను మందునకు వేంకటేశు స్మరణ చల్లనౌనా మనసు శఠియించుఁ గాక | ॥సొగియు॥ |
[1] ‘కరుచ బుద్ధులను’ పూ.ము.పా. యతిభంగము కాబోలు.


