శృంగార సంకీర్తన
రేకు: 67-6
సంపుటము: 5-216
రేకు: 67-6
సంపుటము: 5-216
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎండలు రేయెండలుగా నిరువంకఁ జూచువాఁ డు కొండలుఁ గోట్లునయిన గుణములవాఁడు | ॥పల్లవి॥ |
| పాలవెల్లి కొండమీఁదఁ బల్లెగట్టినవాఁడు పాలలోని పాపఁడన్న ప్రాణమైనవాఁడు పాలఁ బుట్టినట్టికూడు పంచిపెట్టినవాఁడు పాలునేయి ముచ్చిలించి బదికినవాఁడు | ॥ఎండ॥ |
| అలపోతువానితోడ నంటినమేనివాఁడు ఆలఁగాపరులతోడ నాడినవాఁడు ఆలజాలమైన నీటనలరఁ దేలినవాఁడు ఆలపోతు కొండమీఁద ననువైనవాఁడు | ॥ఎండ॥ |
| పాఁపరేని మేను దన పానుపు వేసినవాఁడు మోఁపరయి సకలము మోచినవాఁడు కోపము శాంతములేని కొండలకోనేటివాఁడు పాపముఁ బుణ్యము లేక బదికినవాఁడు | ॥ఎండ॥ |


