శృంగార సంకీర్తన
రేకు: 69-6
సంపుటము: 5-228
రేకు: 69-6
సంపుటము: 5-228
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చల్లనై కాయఁగదొ చందమామా నీ వెల్ల(ల్లి?)గాఁ దిరువేంకటేశు నెదుర మొల్లమిగ నమృతంపు వెల్లి గొల్పుచు లోక- మెల్ల నినుఁ గొనియాడఁగాను | ॥పల్లవి॥ |
| పొందైన హితులు నాప్తులు రసికులును గవులు నందమగు నునుమాటలాడ నేర్చిన ఘనులు చిందులకు నాడేటి సీమంతినీ మణులు చెలఁగి యిరుగడఁ గొలువఁగాను | ॥చల్లనై॥ |
| వందిమాగదులు గైవారింపఁ దనదివ్య- మందిరోపాంత ఘనమార్గమునఁ గోనేటి- ముందటను మంద మందప్రయాణములతోఁ నిందిరాపతి మెరయఁగాను | ॥చల్లనై॥ |
| ఏకాంత ముఖగోష్టినింపొంద మానవా- నీకంబులెడఁ గలసి నిలిచి సేవింపఁ గాం- తాకదంబముల హస్తముల కంకణఝణ- త్కారములు నిగుడఁ జామరములిడఁగ | ॥చల్లనై॥ |
| జోకైన మణిగణస్తోమాంకితంబులై సొంపొందు నాలపట్టములు గరములఁ దాల్చి యేకాంతులిరువంక నెదిరి కొలువఁగ సకల- లోకేశ్వరుఁడు మెరయఁగాను | ॥చల్లనై॥ |
| బంగారుపత్రిమలకు ప్రతులైన దివిజలోఁ కాంగనలు ఘనవిమానాంగణంబుననుండి చెంగలువలును మంచిసేవంతిరేకులను చెలఁగి యిరుగడఁ జల్లఁ గాను | ॥చల్లనై॥ |
| మంగళాత్మకములగు మహితవేదాంత వే- దాంగవిద్యలకు ప్రియమంది చేకొనుచుఁ దిరుఁ వేంగళేశ్వరుఁడు గడు వేడుకలతోడఁ దిరుఁ వీథులను విరించఁగాను | ॥చల్లనై॥ |


