శృంగార సంకీర్తన
రేకు: 70-6
సంపుటము: 5-234
రేకు: 70-6
సంపుటము: 5-234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఏమి సోద్యమిది యెంతయును వెరగాయ ఈ మగువ విభుఁ గలయుటెట్లనో యనుచు | ॥పల్లవి॥ |
| పొలసి నునుఁజెమటలుబ్బుచు నణంగుచునున్న- చెలియభావము చూచి చెప్ప వెరపాయ కలికి వలరాజు బింకపుశరము వాఁడిగా పలుమరునుఁ బదనిడిన భావమో యనుచు | ॥ఏమి॥ |
| చలముకొని వేఁడి వెదచల్లు చూపులతోడి నెలఁతఁ గని కట్టెదుర నిలువ వెరపాయ చెలఁగి లోపలనున్న చిత్తజానలమెల్ల వెలికి వెళ్ళుచు వెల్లివిరిసెనో యనుచు | ॥ఏమి॥ |
| తిరువేంకటేశుఁ బొందిన యింతిచనుదోయి- కురునఖాంకములు గనుఁగొనఁగ వెరపాయ తరుణినేఁపిన విధుఁడు దైవయోగమువలన అరుదయిన శకలంబులా యనో యనుచు | ॥ఏమి॥ |


