శృంగార సంకీర్తన
రేకు: 74-2
సంపుటము: 5-254
రేకు: 74-2
సంపుటము: 5-254
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| పేగుల జంద్యాలు వేసి పెంచపు నమలిపురి పాగగాఁ జుట్టిన నా బాఁపనయ్య వీఁడివో | ॥పల్లవి॥ |
| బిత్తలై పరువులిడి పిన్నబోడితలతోడ కొత్తబొమ్మచారియై గోచిగట్టెను నెత్తురుదానమునేసి నిండిన జడలతోడ బత్తుఁడైన చక్కని నాబాఁపనయ్య వీఁడివో | ॥పేగు॥ |
| కఱవిద్యబాఁపనిచేఁ గఱచె నేరుపులెల్ల గుఱుతుబాఁపనిఁ గనెఁ గొడుకుఁగాను తఱితోడ సందెపొద్దు దప్పనీక జలధిలోఁ బఱపుగాఁ బండిన నాబాఁపనయ్య వీఁడివో | ॥పేగు॥ |
| పచ్చియిఱ్ఱి తోలుచొచ్చి బడలి చొరనిచోటు చొచ్చి తెచ్చె వేదాలు చూడరమ్మా మచ్చిక వేంకటగిరి మరిగి నాకౌఁగిట పచ్చనిదోపతి నాబాపనయ్య వీఁడివో | ॥పేగు॥ |


