శృంగార సంకీర్తన
రేకు: 76-3
సంపుటము: 5-267
రేకు: 76-3
సంపుటము: 5-267
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ముచ్చటకెవ్వరు లేరు మోహమిది బలుదూరు యెచ్చట నెవ్వరులేరు యేఁటికే నాపేరు | ॥పల్లవి॥ |
| మంచముపై నుండరాదు మలఁగుపైఁ బొద్దువోదు నించిన వుయ్యైలలోనా నిద్దుర రాదు అంచెలఁ గన్నుల నీరు ఆఁపరాదాతనిఁబాసి యించుకంత నిలువలే నెట్లు ధరియింతునే | ॥ముచ్చ॥ |
| పవ్వళించేటిల్లు చూచి ప్రాణము నిలుపరాదు దివ్వెచూచి తాలిమైనఁ దిప్పఁగరాదు దువ్వటపుఁ బయ్యదపైఁ దోఁగిన తట్టు పుణుఁగు పువ్వుటమ్ము బాసటమై పొక్కెనేమిసేతునే | ॥ముచ్చ॥ |
| చింతతో ధరించరాదు చెల్లఁ బో మేనైనఁ బోదు ఇంతటఁ జెలులకైన యెఱుక లేదు ఇంతలోనె వేంకటేశుఁడింతి మరుఁగుననుండి యెంతసేసెఁ గలికి వీఁడేమని చెప్పుదునే | ॥ముచ్చ॥ |


