శృంగార సంకీర్తన
రేకు: 78-3
సంపుటము: 5-279
రేకు: 78-3
సంపుటము: 5-279
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఉండవద్దా యిటువంటి వొడికాలను చను- గొండలపై నుదయించెఁ గొండుక చందురుఁడు | ॥పల్లవి॥ |
| మింటిమీఁది చందురుఁడు మేదినిపై కలువల నంటు సేసెనట యేఁటి నాటకములే కంటిచూపు కలువల కలకకోరిచెఁ బైఁడి- వంటిమేని జవరాలి వదన చందురుఁడు | ॥ఉండ॥ |
| జలధిలో జనియించి చందురుఁడె పగలాయ జలజములకు నేఁటి శాంతములే మెలుఁతమోమై నేఁడు మెత్తనికరతలము- జలజానఁ బవళించెఁ జక్కని చందురుఁడు | ॥ఉండ॥ |
| చింకచందురుఁడు కందుఁజీఁకటి మైచీఁకటే యింకఁజేసి పారఁదోలీనేఁటిపొందులే వేంకటేశుని కౌఁగిట వెలఁదిమోమై నేఁడు వంక నెరిచీఁకటి వలఁచె జందురుఁడు | ॥ఉండ॥ |


