Display:
శృంగార సంకీర్తన
రేకు: 79-4
సంపుటము: 5-286
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇన్నియుఁ జేసితి విఁకనేలా నీ-
చిన్నినగవు మూసెర నీచేఁత
॥పల్లవి॥
మఱవకురా నీమాటలు ని-
న్నెఱుఁగుదు నిన్నియు నిఁకనేలా
మొఱఁగకురా నీమోహము నా-
చెఱఁగు మాసెనిదె చెల్లె నీచేఁత
॥ఇన్ని॥
చిందకురా నీ చెలువములు ఇపు-
డిందరునున్నారిఁకనేలా
కందకురా నీ కాఁకలను యిటు
కిందుపడితినిదె గెలిచె నీచేఁత
॥ఇన్ని॥
నొంపకురా నే నొగులఁగా నీ-
యింపులు నెరపేనిఁకనేలా
జంపుల వేంకటశైలపతీ నా-
కెంపుమోవి దక్కెర నీచేఁత
॥ఇన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము