Display:
శృంగార సంకీర్తన
రేకు: 89-6
సంపుటము: 5-349
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
చెప్పిన హృదయము గలఁకెడు చెలి దానిపుడెట్లున్నదొ
అప్పుడు పరితాపంబున నలసిన చందములు
॥పల్లవి॥
వేడుకతో సంగీతము విని కన్నుల మెచ్చుచు-
నాడుచుఁ బ్రాణేశ్వరుఁగొనియాడెడి చందములు
కాడిన మర్మపుమాటల కంపంబునఁ దలయూఁపుచు
చూడక చూచిన చూపుల చొక్కెడిచందములు
॥చెప్పిన॥
చనుఁగవ సన్నపు చెమటలు జారెడి పయ్యెదనార్చుచు-
నొసరిన నిట్టూర్పులచే నూటాడెడి చందములు
తనువునఁ బలుమరుఁ బొడమెడి దట్టపు పులకాంకురములు
అనువున మెత్తక కరమున నంటిన చందములు
॥చెప్పిన॥
తిరువేంకటగిరివల్లభు దేవశిఖామణికౌఁగిట
తరుణి మనోభవుబారినిఁ దప్పిన చందములు
యిరవుగ నాతని చేఁతలు నింపగుఁ బరవశములచే
దొరలిన మరపుల నెరుకలఁ దూలెడి చందములు
॥చెప్పిన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము